1, ఫిబ్రవరి 2012, బుధవారం

భజగోవిందం - పరిపూర్ణ వ్యక్తిత్వానికి పునాది. (3)

         శంకరాచార్యులవారు  మానవ మానసిక విచలతకు మూల కారణాన్ని ఈ 3 వ శ్లోకంలో వివరించారు.  కడవంత  గుమ్మడికాయ  కత్తిపీటకు  లోకువన్నట్టు  ప్రతీ వ్యక్తి స్త్రీ వ్యామోహంలో పడి తన జీవితాన్ని నాశనం
 చేసుకుంటున్నాడు.   '' ఎంతనేర్చినా  ఎంత చూసినా ఎంతవారలైనా  కాంత దాసులే ''  అని త్యాగరాజు గారన్నట్టు కాంతా వ్యామోహంలో తన జీవిత లక్ష్యాలను ఉపేక్షించిన వారు  చరిత్రలో కోకొల్లలు.  జహంగీర్   నూర్జహాన్  వ్యామోహంలో పడి తన రాజ్యాధికారాన్ని సైతం ఆమె చేతిలో పెట్టి  తన జీవిత పర్యాంతం లో   జహంగీర్  నామా  అనే ఆత్మకథలో  ఒక రొట్టె ముక్క కోసం,  గుక్కెడు మధువు కోసం తన అధికారాన్ని నూర్జహాన్ కు అమ్ముకున్నానని తలచి తలచి బాధపడతాడు.    ఈ శ్లోకాన్ని ఒక సారి పరిశీలించినట్లైతే.. 

                   నారీస్తనభర నాభీదేశం
                  దృష్ట్వా మాగామోహావేశం
                  ఏతన్మాంసవసాది వికారం
                  మనసి విచింతయ వారం వారం
భావం ;   స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.
       స్త్రీల బాహ్య సౌందర్యం చూసి మోహావేశంను పొంది  తమ కర్తవ్యాలను ఉపేక్షించినవారెందరో  నిత్యం కనబడుతుంటారు.  అరిషడ్వర్గాలలో  కామం  అనేది  అతి ముఖ్యమైనది. మనిషనేవాడు కోరికలపుట్ట. స్వేచ్చా జీవిగా
పుట్టిన  మానవుడు  సర్వత్రా సంకెళ్ళతో ఉన్నాడు  అన్నాడు రూసో.  ప్రాకృతిక స్వేచ్చ లో  ప్రతీ మనిషి  తన కోరికలు  తీర్చుకోడానికి  తన ఇచ్చానుసారం ప్రవర్తించవచ్చునేమో గాని  సామాజిక జీవితం  ప్రారంభమయిన  తర్వాత  కుటుంబ  వ్యవస్థ  అనేది  ఏర్పాటు  చేయబడి  మనిషి  తన  కోరికలను  తీర్చుకునేందుకు   కొన్ని  నియమాలు  ఏర్పాటు చేసారు.   ఎవరైనా ఈ కట్టుబాటులను     అనుసరించవలసినదే.
            కామప్రకోపాలను నియంత్రించుకోలేక స్త్రీల బాహ్యసౌందర్యమే ప్రధానంగా  వ్యామోహం  లో  చిక్కుకున్నట్టైతే  మనిషికి  పతనం  తప్పదు.   పరస్త్రీ  వ్యామోహంలో పడి తమ  భవిష్యత్తు నాశనం  చేసుకున్నవాళ్ళు  మనకు  చరిత్రలో  చాలామంది కనబడతారు. రావాణాసురుడు మరణించిన తర్వాత  రాముడు  అలసటతో  యుద్ధభూమిలో  ఒక రాతిపై  కూర్చొని  ఉన్నాడట. సూర్యాస్తమవుతున్నసమయంలో ఒక స్త్రీ  రాముడున్న   చోటుకి వస్తుంది.  రాతి పై  కూర్చొని  ఉన్న రాముడు  తన వైపు వస్తున్న  ఆ నీడ తనవైపు  రావడం  చూసి   ఆ నీడ తనకు  తగలకుండా   జరగసాగడట.    దానితో   ఆ  నీడ అక్కడే  ఆగి వెనక్కి    వెళ్ళిపోసాగింది.  రాముడు  బిగ్గరగా   ఎవరది  అని అడిగితే  ఆమె  ఆగి  దగ్గరగా వచ్చి ఇలా చెప్పిందట. ''  అయ్యా!  నేను  మండోదరిని.  రావాణాసురుని  భార్యను.   నా భర్త  అరివీర  భయంకరుడు.  గొప్ప శివభక్తుడు.  అలాంటి  మహా శక్తిమంతుడిని  వధించిన  వ్యక్తి  ఎలా  ఉంటాడో అతని గొప్పతనం   ఏమిటో  స్వయంగా తెలుసుకుందామని  వచ్చాను.   ఇక్కడకు వచ్చాక నాకు నా భర్త బలహీనత . అర్థం అయింది.   పరస్త్రీ నీడ  కూడా మీపై  సోకకుండా  మీరు  మిమ్మల్ని  నియత్రించుకుంటున్నారు.  మరి నాభర్త పరస్త్రీ వ్యామోహంలో ప్రాణాలను,  రాజ్యాన్ని కోల్పోయాడు. అదే మీ ఇద్దరిలో తేడా అని చెప్పి నమస్కరించి   అక్కడనుండి వెళ్ళిపోయిందట.
            ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని  ఆ బలహీనతను జయించడం ఎలా అన్న వారికి  శంకరాచార్యులు వారు దారి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో.   స్త్రీ  సౌందర్యం అంతా  మాంసం, క్రొవ్వు ల సమూహమే అనే ఏహ్య భావాన్ని అలవరుచుకోవడం  ద్వారా ఈ వ్యామోహం నుండి బయట పడవచ్చు.  వయస్సు ఊడిగిన నాడు ఈ బాహ్యమైన తళుకులు బెళుకులు నశిస్తాయని అర్థం చేసుకోవాలి.   భోగి కాని వాడు యోగి కాలేడు అన్న  వేమన యోగి గా మారడానికి అతనిలో కలిగిన వైరాగ్యం మరియు ఏహ్యతా భావనయే.  స్త్రీ వ్యామోహం లో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వేమన ఒక వేశ్య ఆకర్షణలో ఉంటాడు. ఆమె తన కోరిక తీర్చడానికి ఏదైనా బంగారు నగ కానుకగా కోరుతుంది. వేమన తన ఒదినె వద్దకు వచ్చి బంగారు నగ అడుగుతాడు. అది ఎందుకోసమో తెలుసుకున్న ఆమె  తన బంగారు నగను వేమనకు ఇచ్చి ఒక షరతు పెడుతుంది.  ఆ  వేశ్య ఆ నగను మరుగుదొడ్డిలో  నగ్నంగా ఉన్నప్పుడు తలను వచ్చి  కాళ్ళమధ్యగా వెనుకనుండి  ఆ నగను తీసుకోవాలని వేమనకు చెబుతుంది.  అలాగే అని వెళ్ళిన  వేమన  ఆ దృశ్యం చూడటంతో అతనిలో ఏహ్యతా భావం ఏర్పడి తన కామప్రకోపాలను త్యజించి, ఇటువంటి నీచమైన పనులలో తన యవ్వనం కోల్పోయానని యోగిగా మారుతాడు.  మనమైతే  యోగి గా మరనవసరం లేదు కాని అశాశ్వతమైన బాహ్య సౌందర్యాలు శాశ్వతమనే మాయలో పడకుండా ఉండగలిగి. లక్ష్యసాధనకు కృషి చేస్తే  చాలు..                   

26, జనవరి 2012, గురువారం


                            భజగోవిందం                                 వ్యక్తిత్వ వికాసానికి, పరిపూర్ణ జీవితానికి పునాది (2)
           ఇద్దరు వ్యక్తులు కలిస్తే అడిగే మొదటి ప్రశ్న మీరు ఏమి చేస్తుంటారని  చెప్పే సమాధానం బట్టి వచ్చే జీతం సంపాదన లెక్కకట్టి దాని బట్టి వారు ఇచ్చే గౌరవం ఆధారపడియుంటుంది.  అబ్బాయికి పెళ్ళి కుదిరిందంటే  అడిగే ప్రశ్న పెళ్ళికూతురు ఏం చదివింది ఏం చేస్తుందని కాదు.  కట్నం ఎంత అని..  అమెరికా లోని పౌరహక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూదర్ కింగ్        '' మనం ఎటువంటి సమాజంలో నివసిస్తున్నామంటే  ఒక వ్యక్తి సామర్థ్యం లేదా విజయం ఆ వ్యక్తి సంపాదించే జీతం మొత్తం బట్టి నడిపే వాహనం యొక్క  పరిమాణం బట్టి కాక ఆ వ్యక్తి సమాజానికి, తోటి మానవులకు ఏ రకమైన సేవ చేస్తున్నాడనేదానిబట్టి కాదు''  ఈ మాట 1968 లో అన్నా ఇప్పటికీ ఇది అక్షర సత్యంగా ఉంది.  ఎప్పుడైతే వ్యక్తులమధ్య డబ్బు ప్రాధాన్యత పెరిగిందో దానికి అంతం ఉండదు. సంపాదన తో తృప్తి ఉండదు. తీవ్ర మైన పోటీ ,నిరాశా. అసంతృప్తి  ఒకటేమిటి అన్ని అనార్ధాలకు దారి ఏర్పడినట్టే....
       అందుకే భజగోవిందం రెండవ శ్లోకంలో శంకరాచార్యులు గారు ఇలా చెబుతున్నారు...

      మూఢ జహీహి ధనాగమతృష్ణాం
      కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం
      యల్లభ సేనిజకర్మోపాత్తం
      విత్తం తేన వినోదయ చిత్తం ..
 (   అర్థం;  ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.) 
               ప్రపంచమంతా  www ల వెంట పిచ్చిగా పరుగెడుతుంది.. అయితే ఈ మూడు ఎంత పొందిన తనివి తీరదు.. యే దిల్ మాంగే మోర్  అంటూ   పరుగులు పెడుతునే ఉంటుంది...  అవి ఏమిటంటే  w -  wealth,  w - wine   and   w - women.  అలగ్జాండర్ ది గ్రేట్  మృత్యువు తో పోరాడుతూ  తన చివరి మూడు కోరికలు తెలియచేస్తాడు.    దానిలో చివరి కోరిక తన శవపేటికకు రెండు రంధ్రాలు ఉంచి తన చేతులు బయటకు ఉంచి తనను పూడ్చమంటాడు.  ప్రపంచ విజేతయైన అలగ్జాండర్ ఖాళీ చేతులతో వచ్చాడు  తిరిగి ఖాళీ చేతులతో పోయాడని అందరికీ తెలియాలని ఆయన అభిమతం.  పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటపుడు అది వెంట రాదు అంటూ ఒక సినీ కవి చెప్పినదీ అదే.
                 శంకరాచార్యులు వారు  ఈ శ్లోకంలో  ధనాన్ని సంపాదించాలనే దురాశను విడిచిపెట్టు.  కోరికలను వదలాలి అనే బుధ్ధిని పెంచుకో. ప్రతీ వ్యక్తి తాను చేసే కర్మలను, అర్హతలను బట్టి సంపాదించే ధనంను ఆనందం గా తృప్తి చెందాలని స్పష్టంగా  చెప్పారు.   గనులు తవ్వి. బంగారు పాత్రల్లో తిని, బంగారు పాయిఖానాల్లో విసర్జించే వ్యక్తి  చివరికి చిప్పకూడు తినాల్సిరావడానికి దురాశ మాత్రమే కారణం కాదా.అనేకమంది  అర్హతను మించి దురాశను పెంచుకోవడం వలన వారికి మనశ్శాంతి లేకపోవడం, మిగిలినవారికి మనశ్శాంతిలేకపోవడం మనం రోజూ చూస్తున్నాం.  సంపద అస్థిరమైనది. విశ్వసార్వభౌముడైన హరిశ్చంద్రుడు అడవులపాలై   నక్షత్రకునితో  సంపదలగురించి చక్కటి పద్యం చెబుతాడు

    తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగి రా వేరి కే
   సరికేపాటు  విధించెనో విధి యవశ్య ప్రాప్యమద్దాని నె
  వ్వరు  దప్పించెద్? రున్నవాడననిగర్వం బేరికిన్ గాదు! కిం
  కరుడే రాజగు  రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్
    
         ( సంపదలనేవి ఎప్పూడు స్థిరంగా ఒకనివెంట రావు. ప్రతి వ్యక్తి తన ప్రాప్తిని బట్టి పొందగలడు. జరిగేదాన్ని ఎవరూ తప్పించలేరు.  ధనమున్నదనే గర్వం ఎప్పుడూ పనికి రాదు. కాలానుగుణంగా ఈనాటి రాజే కింకరుడు కావచ్చు, కింకరుడు లాంటి వాడు రాజు కాగలడు. ) 

               ఇట్టి అస్తిరమైన సంపదార్జనకై  దురాశను పెంచుకోవద్దు మూర్ఖుడా అని ఈ శ్లోకం మన జీవితంలో  దురాశను  పెంపొందించుకొనక, ఒకరితో సరిపోల్చుకోకుండా వచ్చిన దానితో సంతృప్తి పెంచుకోవాలి  సంతృప్తిని మించిన సంపద  లేదు, దురాశను మించిన దారిద్రం లేదు.

                                   భజగోవిందం - వ్యక్తిత్వ వికాసం
                  
                   శంకరాచార్యులు మరియు అతని శిష్యగణం చే చెప్పబడిన భజగోవింద శ్లోకాలు నేటి కాలానికి, ప్రతి వ్యక్తి జీవితంలో ఎదుర్కునే ప్రతి మానసిక సమస్యకు చక్కని నివారణ మార్గాన్ని చూపే నిత్య సత్యాలు.  కాశీ పుర వీధుల్లో శిష్యులతో వెలుతున్న శంకరాచార్యులు వ్యాకరణ సూత్రాలను వల్లె వేస్తున్న ఒక ముసలి బ్రాహ్మణున్ని చూసి  వయసు ముదిరిన ప్రాపంచిక విద్య పట్ల  దాని ద్వారా సంపాదించాలనుకున్న ధనం పట్ల  దాని ద్వారా తీర్చుకోవాలనుకున్న కోరికల పట్ల అతనికి తాపత్రయం గ్రహించి  ఆసువుగా శంకరాచార్యులు మరియు శిష్యులచే చెప్పబడిన శ్లోకాలు  సర్వకాల సర్వావస్థలకు ఉపయోగమే.  నేటికాలంలో  కోరికల,  ఆశల, వలయాల్లో చిక్కుకొని జీవిత పరమ ధర్మమేమిటో నిజమైన  సచ్చిదానందం ఎక్కడ దొరుకుతుందో తెలియక అనేక వ్యథలలో చిక్కుకున్న వారికి మోహముద్గారం కలిగించి జీవితంపట్ల స్పష్టమైన అవగాహన కలిగించే  ఈ భజగోవింద శ్లోకాలలో నిమిడియున్న  తత్వాలను వ్యక్తిత్వ వికాస కోణం నుండి తెలుసుకుందాం.


భజగోవిందం భజగోవిందం
గోవిందం భజమూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే .. 

        ప్రతీ మనిషి జీవితంలో నాలుగు ధృక్కోణాలుంటాయి.  ఒకటి   శరీరం -  మనస్సు  -  హృదయం  -  ఆత్మ.   శారీరక  భౌతిక మొదలైన అంశాలు  శరీరం నకు సంబంధించి,  తెలివితేటలు, మేథా శక్తి  మనసుకు  సంబంధించి,  భావోద్వేగాలు  హ్రుదయానికి సంబంధించి  ఆథ్యాత్మిక అంశాలుకు సంబంధించి  ఆత్మకు సంబంధించినవి.  కాని మనం  శారీరక మరియు  మేథా శక్తికి సంబందించిన విషయాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి  మిగిలిని రెండింటిని నిర్లక్ష్యం చేస్తాం.  అన్నింటికన్నా ఆథ్యాత్మిక విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాం. 
      start early, drive slowly and reach safely అన్నది ఆథ్యత్మికత కు సంబంధించినదే.  అథ్యాత్మిక అనేది  రిటైర్ అయ్యాక, వయసు తీరినతర్వాత మొదలు పెట్టాల్సిన విషయం అని భక్తికి సంబందించి లేదా ఆత్మజ్ణానానికి సంబంధించిన విషయాలను వాయిదా వేస్తాం.  ప్రాపంచిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తాం.
                     శంకరాచార్యులవారు వయసు గతించినప్పటికీ,  ప్రాపంచిక విద్యనువదిలి,  పరావిద్యను గ్రహించి ఆత్మజ్ణానానికై ఆలోచించని ముసలిబ్రాహ్మణునితో   ఓ మూర్ఖుడా...వయసు మీరిపోయి  చావు సమీపించే వయస్సులో కూడా  ఆత్మజ్ణానం కోసం కాకుండా కాసులు సంపాదించే ప్రాపంచిక జ్ణానం కోసం ఎందుకు ప్రయాసపడతావు. ఇవి ఏవీ కూడా  చావు సమీపించినపుడు నీకు రక్షణ కలిగించలేవు. అని బోధిస్తున్నరు ఈ శ్లోకం ద్వారా.  మనం కూడా అథ్యాత్మిక తత్వాన్ని ముందుగా తెలుసుకొని దేనికి ఇవ్వవల్సిని ప్రాధాన్యత దానికి ఇస్తే తప్పనిసరిగా  బాధలు తొలగించుకోవచ్చును.  అత్యంత సంపన్నులైన బిల్ గేట్స్, వారెన్ బఫెట్స్  తమ సంపాదన్  త్రుణ ప్రాయంగా విసర్జించి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవడమే కాకుండా మానవ సేవయే మాధవ సేవ అని  భగవంతుని సేవ చేయాలనే  ఆథ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేపట్టడం గమనించినట్లైతే  డబ్బు సంపాదనే జీవితం అని తలపోసేవారికి కనువిప్పు కలుగక మానదు.  కాబట్టి  శారీరక, మానసిక, భావోద్వేగ  అంశాలతో పాటు  అథ్యాత్మికాంశాలకు ప్రాధాన్యత ఇచ్చి వివేక,వైరాగ్యాలను పెంచుకోవడం చాలా మంచిది.  అలాంటి పరిస్థితిలలో  చివరకు మరణం ఆసన్నమైనపుడు భవబంధాలను విసరించి చావును ఆనందంగా స్వీకరించే అత్యున్నత మానసిక స్థితికి చేరుకోగలం సచ్చిదానందాన్ని పొందగలం.

25, జనవరి 2012, బుధవారం

పూర్ణంలో.........


రణగొణ ధ్వనులకు దూరంగా,
పనికిరాని
పస చచ్చిన
పాచి పట్టిన
బాతాఖానీలకు స్వస్తి చెప్పి
నీ శ్వాసే ఏకైక ధ్యాసగా
నీ హృదయ నాదమే
ప్రణవ నాదం గా
నీలో నీవై
నిమగ్నుడివై
నిశ్శబ్దపు గాఢ లోతుల్లో
అంతం లేని ఆలోచనలకు
శాశ్వత స్వస్తి చెప్పి
సుషుప్త స్థితికి సారూప్యమైన
భావరాహిత్య స్థితిలో
నిశ్చల స్థితిలో
ప్రాకృతిక శక్తిలో
లయం పొందేలా

వాసనా  రహితుడివై
నీ సహజ స్థితిని 
తిరిగి పొందేందుకు
సదా నిశ్శబ్దం లో రమించు
నీపై నీవే ధ్యానించు
నీ అంతరంగ లోకం లో  విహరించు
భయాలకు, భ్రాంతులకు చోటులేని,
ఆర్తి కోసం
కీర్తి కోసం
లోకం మెప్పు కోసం
పదే పదే ప్రాకు లాడే
దాస్యానికి వీలు లేని,
నలుగురి పై
అజమాయిషీ చలాయించాలనే
అర్థంలేని, వ్యర్థమైన
అహాన్ని ప్రదర్శించాలనే
పరితాప పడనవసరం లేని
సంపూర్ణమైన
పరిపూర్ణమైన
జీవనాన్ని కొనసాగించు
పూర్ణంలో లీనమయ్యేందుకు ఉపక్రమించు